
కడప (PENNERU News): సమ్మేటివ్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం సరికాదని యుటిఎఫ్(UTF )రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్ పాలెం మహేష్ బాబు తెలిపారు. యుటియఫ్ భవన్ నందు జరిగిన టీచర్ ఎమ్మెల్సీ శ్రీ షేక్ సాబ్జి గారి వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి యుటిఎఫ్ నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ పరీక్షలు జరుగుతున్నాయని ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించడం సరికాదని వారన్నారు. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి తరుణంలో ఉపాధ్యాయులను శిక్షణా తరగతులలో నిమగ్నం చేస్తే పాఠశాలల్లో పిల్లలకు పరీక్షలు ఎవరు నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. పరీక్ష పూర్తయిన రెండు రోజుల్లో పేపర్లు దిద్ది ఆన్లైన్లో మార్కులు కూడా నమోదు చేయాలని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారని, పరీక్షలు జరుగుతున్న సమయంలో వారం రోజులు పాటు ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ పేరుతో పాఠశాలలకు వారం రోజులు పాటు దూరం చేయడం వలన ఈ పనులు ఎవరు చేస్తారని వారు ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న అసంబద్ధమైన నిర్ణయాలను కూడా వారు తప్పు పట్టారు. 10 శాతానికి మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదు అనే ఆంక్షలు ఉపాధ్యాయులపై రుద్దుతున్నారని , పదవ తరగతి పరీక్షలకు సంసిద్ధత అనే పేరుతో ఇటీవల రాష్ట్ర ఎస్సీఈఆర్టీ అధికారులు విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఉపాధ్యాయులను సెలవు రోజుల్లో కూడా పాఠశాలలకు రమ్మనడం సరికాదన్నారు. అలాగే సంక్రాంతి సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు పాఠశాలల్లో పని చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకపక్క విద్యార్థులకు సెలవుల్లో ఏ రకమైన తరగతులు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ, మళ్లీ అదే విద్యాశాఖ అధికారులు సెలవుల్లో క్లాసులు పెట్టమనడం విచిత్రంగా ఉందని వారు వ్యాఖ్యానించారు.కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ అసంబద్ధ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఉద్యమాన్ని చేపడతామని మరియు శిక్షణ తరగతులను బహిష్కరిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్, డి సుజాత రాణి జిల్లా ట్రెజరర్ నరసింహారావు జిల్లా కార్యదర్శులు ఎ.శ్రీనివాసులు, ఏజాస్ అహమ్మద్,ఈరి బాలజోజి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓబుల్ రెడ్డి, రూతు ఆరోగ్యమేరి, కృష్ణారెడ్డి ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు ఈశ్వర రావు, శంకర్ రెడ్డి, అనిల్ కుమార్, రామచంద్రయ్య,అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.