
ప్రొద్దుటూరు (PENNERU News) :
గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన భూ అక్రమాల పై బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి , కామిశెట్టి బాబు తలారి పుల్లయ్య, నల్ల బోతుల నాగరాజు తెలిపారు. గురువారం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత వైసిపి హయాంలో జరిగిన అక్రమాలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుండి వినతులు స్వీకరించిన నేపథ్యంలో అధికంగా భూ సమస్యలే ప్రజల నుండి వస్తున్నాయన్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపట్టారని వివరించారు. ఈ క్రమంలో మండలంలోని దోరసానిపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పాల్గొని సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన భూ దందాలు అసాంఘిక కార్యక్రమాలపై ప్రస్తావిస్తే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్న చందంగా తననే అన్నట్లు భావించడం సరికాదన్నారు. వారి ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి చౌటపల్లి చర్చి భూములు దోచిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. జగనన్న కాలనీలు ఏర్పాటుచేసిన స్థలాలను తక్కువ ధరకు కొని, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు విక్రయించిన మాట నిజం కాదా అన్నారు. గత ఐదు సంవత్సరాల పాలనలో ఖజానా ఖాళీ చేశారని కేవలం అప్పులు మాత్రమే మిగిలాయన్నారు. దీనివల్లనే సంక్షేమ పథకాల అమలు ఆలస్యం జరుగుతుందని వివరించారు గత ఐదు సంవత్సరాలలో హైకోర్టు కర్నూల్ లో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు ముందుకు వచ్చి రాచమల్లు అక్రమాలపై తెలిపితే అతనిపై కూడా విచారణ జరిపిస్తామని వివరించారు.