
మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసిన ప్రొద్దుటూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు
ప్రొద్దుటూరు ( PENNERU News) : కడప జిల్లా వేముల మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట అధికార పార్టీ నేతలు కొందరు సాక్షి మీడియా ప్రతినిధులపై దౌర్జన్యకర చర్యలకు దిగడం హేయమైన చర్య అని, ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మేరకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు శుక్రవారం స్థానిక మండల తాహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. సాగునీటి ఎన్నికల కవరేజ్ లో భాగంగా వేముల ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, పత్రికా విలేఖరి రాజా రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంపై జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అన్ని రాజకీయ పార్టీల, వర్గాల వార్తలను కవర్ చేసే మీడియాపై అధికార పార్టీకి చెందిన నేతలు ఈ విధంగా వ్యవహరించడంపై వారు విచారం వ్యక్తం చేశారు. మీడియాపై దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణం చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా , సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
