
110 పేజీల నోట్ ముఖ్యమంత్రికి పంపాం..
రాయలసీమకు సంభందించిన అన్ని విషయాలు అందులో పేర్కొన్నాం..
నిజాయితీ ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి..
రాయలసీమ సమాజం అవగాహనతో అడుగులు ముందుకు వేయాలి..
కడప ఇంజనీర్స్ భవన్ లో అఖిల పక్ష సమావేశం
పెన్నేరు ముఖాముఖిలో బొజ్జా దశరథ రామిరెడ్డి
కడప (PENNERU NEWS) :
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో రాయలసీమ వాళ్ళ పాత్ర కూడా ఎంతో ఉంది గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా రాయలసీమలో ఇవ్వని మెజార్టీని మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టారు. అయితే ఇదే విషయాన్ని చంద్రబాబు ఉటంకిస్తూ ఈ ప్రాంతానికి మేలు చేస్తారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కూడా అనేక హామీలు ఇచ్చారు. వాటిని నెరవేరుస్తారని, ఆ దిశగా కార్యాచరణ చేపడతారని మేము ఆశిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలిస్తే.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు, పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కొన్ని కార్యాలయాలను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్ ను కూడా రాయలసీమలో ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్ కు సంబంధించిన ప్రక్రియమొదలైంది. ఆ దిశగానే హార్టికల్చర్ హబ్, సీడ్ హబ్ ఏర్పాటు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని రాయలసీమ వాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీడ్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఏపీ సీడ్స్ ప్రధాన కార్యాలయం రాయలసీమకు తరలిరావాలి. ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ కార్యాలయం కూడా ఇక్కడికి రావాలి. ఇందుకు సంబంధించి అనుబంధ రంగాల కార్యాలయాలు ఇతర ల్యాబ్స్, రీసెర్చ్ స్టేషన్స్, జాతీయస్థాయి విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు కావాలి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అది ఏర్పాటు కావాలి. వీటన్నిటిని రాయలసీమకు తరలించినప్పుడే అది సాధ్యమవుతుందని, ఆ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు హార్టికల్చర్ కమిషనరేట్ కార్యాలయం కూడా రాయలసీమలో ఏర్పాటు చేసినప్పుడే ఆ కల సాకారం అవుతుంది. రవాణా, మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించినప్పుడే హార్టికల్చర్ హబ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీలుంటుంది. అయితే చెప్పిన విధంగా ఆచరణలో ఇవేమీ జరగలేదన్నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
110 రోజుల వరద వచ్చినా శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేసారు..

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో కృష్ణానదిలో 110 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నిబంధనలు, విధి విధాల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా కనిపించాలి. కానీ, ఖాళీ అవుతున్న ప్రభుత్వం నోరు మెదపలేదు. కృష్ణా నదిపై ఉన్న తుంగభద్ర, జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల ప్రకాశం బ్యారేజి ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. శ్రీశైలంను ఖాళీ చేస్తూ, బురదను మిగులుస్తున్న అంశంపై రాయలసీమ వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న సందర్భంలో కూడా అటు ప్రభుత్వం కానీ, ఇటు రాజకీయ పార్టీలు కానీ మాట్లాడక పోవడం చాలా దారుణం. రాయలసీమలోని రాజకీయ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాల ప్రకారం కనీస నీటి మట్టం 854 అడుగులకు పైన 90 అడుగుల్లో 60 అడుగుల క్యారీ ఓవర్ ఉండాలి. అంటే 150 టీఎంసీల నీరు వచ్చే ఏడాది వర్షా కాలం వరకు నిలువ ఉంచాలి. వరద కారణంగా ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు 1,500 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 850 టీఎంసీల నీటిని వృధాగా సముద్రం పాలు చేశారు. ఇన్ని నీళ్లు వచ్చినప్పుడే కనీసం 150 టీఎంసీలు నీటిని నిలుపుకోలేక పోవడం, కేవలం 113 టీఎంసీలకే రిజర్వాయర్ ను పరిమితం చేస్తున్నా దీనిపై మాట్లాడకపోవడం విచారకరం.
8 లక్షల ఎకరాల కే నీటి కల్పన
వందల టిఎంసిల నీరు ప్రవహించినా కూడా రాయలసీమలోని 20 లక్షల ఎకరాల సాగు నీరు అందించాల్సి ఉండగా, 8 లక్షల ఎకరాలకు కూడా నీరు అందివ్వని పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై ఏమి మాట్లాడకుండా గోదావరిని ఒక గేమ్ చేంజర్ గా మారుస్తాం, అలాగే గోదావరిని పెన్నాతో అనుసంధానం చేస్తాం, కృష్ణతో కలిపాక నీటిని అందిస్తామంటూ రాయలసీమ ప్రజలను ఏమార్చే మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏమిటి అని అడగలేని రాజకీయ వ్యవస్థ, ప్రశ్నించలేని సమాజం రాయలసీమలో ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ సమాజానికి సాగునీటి సమస్యలు, హక్కులు, ప్రభుత్వ హామీలు నెరవేరకపోవడం, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకపోవడం వంటి వాటిపై అవగాహన కల్పించే విధంగా కడప నగరంలో ఇంజనీర్స్ భవన్లో అఖిలపక్షం ఓ సదస్సు నిర్వహిస్తోంది. దీనికి ముందు బాపట్ల కూడా ఇలాంటి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో, కోస్తా ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని ప్రణాళికతో ముందుకు పోతున్నాం.

రాయలసీమ పట్ల చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది..
మిగతా ప్రాంతాల వారికి రాయలసీమ చాలా సస్యశ్యామలంగా ఉంది, శ్రీశైలంలో నీటిని అన్నిటిని రాయలసీమ వాసులు వాడుకుంటూ అనుభవిస్తున్నారు అన్న ఒక అవగాహన లేని దురభిప్రాయం ఉంది. ఇదే అభిప్రాయాన్ని కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల బుర్రలోకి కూడా ఎక్కించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వంలోని పెద్దలు రాయలసీమలో జరుగుతున్న నీటి వివక్ష పైన,నిర్లక్ష్యం పైన, అన్యాయాలపైన మాట్లాడకుండా ఉన్నారేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. రాయలసీమకు సంబంధించిన అన్ని విషయాల పైన సమగ్రంగా మాట్లాడేందుకు ఇక్కడి పరిస్థితులు వివరించేందుకు ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ ద్వారా 110 పేజీల లేఖను ఒక నోట్ ను పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడి వాస్తవ పరిస్థితులను తెలియజెప్పే ప్రయత్నం చేశాం. కలెక్టర్ ద్వారా పంపినటువంటి ఈ విజ్ఞాపనపై ముఖ్యమంత్రి స్పందించి అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశతో ఉన్నాం. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వారి మాటల్లో నైతికత లేదు అని రాయలసీమ వాసులు అనుకోవాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి కి పంపిన 110 పేజీల నోట్ లో అనేక విషయాలను పొందుపరిచాము. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి వివరించాం. అన్నమయ్య, అలగనూరు రిజర్వాయర్ల అధ్వాన్న స్థితికి ఎలా వచ్చాయో తెలియజేశాం. గోరుకొల్లు లాంటి ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నాయి. అనేక ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చేపట్టాల్సిన నిర్మాణాలు పూర్తి చేయకుండా, అలగనూరు లాంటి రిజర్వాయర్లు కృంగిపోయిన పట్టించుకోకపోవడం దారుణం. భూసేకరణ చేయకుండా గాలేరు – నగరికి ఆయకట్టుకు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. హంద్రీనీవా ప్రాజెక్టులో 3,500 క్యూసెక్కుల నీరు వెళ్లాల్సి ఉండగా కేవలం 1000 క్యూసెక్కుల నీరు మాత్రమే వెళుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోని వైనాన్ని ఆ నోట్ లో స్పష్టంగా తెలియజేశాం. రాష్ట్రంలో మంచి కాలం వచ్చిందని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో నిధులు కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జూన్ లో ప్రకటించిన మెయింటెనెన్స్ నిధులు నవంబర్లో విడుదల చేయడం వల్ల చెరువుల మరమ్మత్తులు, ప్రాజెక్టుల గేట్ల మరమ్మత్తులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. వెలుగోడు నుంచి సిద్దాపురానికి ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్ కేబుల్ వ్యయం కేవలం రెండు లక్షలు. ఆ నిధులు కూడా ఇవ్వక పోవడం వల్ల అది ఆగిపోయింది. ముఖ్యమంత్రికి పంపించిన లేఖలో ఇలాంటి అనేక అంశాలతో పాటు, ఎన్నికల ముందు వారు వెలిబులిచ్చిన ఆకాంక్షలు, చేపడతామన్న ప్రాజెక్టుల నిర్మాణాలను వారికి గుర్తు చేస్తూ వివరాలు ఇచ్చాం. ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆ నోట్ ను పరిశీలిస్తే, వారు చెప్పిన విషయాలు, ఇచ్చిన హామీలు, రాయలసీమ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, నీటి సమస్యలు ఏమిటో వారికి అర్థమవుతాయి. విభజన చట్టంలో పొందుపరిచిన రాయలసీమ సంబంధించిన అనేక అంశాలు, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలింపు అంశం, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని కూడా అందులో వివరించడం జరిగింది. కృష్ణ-గోదావరి నదుల అనుసంధానం ఎంత అవసరమో, అమరావతి, పోలవరం నిర్మాణాలు ఎంత అవసరమో వాటికన్నా కీలకమైన రాయలసీమలోని చెరువులను అనుసంధానం చేయడం, చెరువులు నిర్మాణం చేయడం వాగులు వంకలతో అనుసంధానం చేయడం, పెన్నా నదిని పునర్జీవనం చేయడం, పర్యావరణ పరి రక్షణ కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నోట్లో స్పష్టం చేయడం జరిగింది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు కాకపోతే భవిష్యత్తులో రాయలసీమ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదన్న విషయాన్ని కులంకుషంగా వివరించడం జరిగింది.
శ్రీశైలం ప్రాజెక్టు మీద, తుంగభద్ర ప్రాజెక్టు మీద రాయలసీమకు ఉన్న హక్కు మేరకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా నాలుగు ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉండగా పది ఏళ్ళైనాఅతి గతి లేదు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది సంతోషం. అది చేస్తూనే విభజన చట్టంలో చట్టబద్ధంగా రాయలసీమలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా పట్టించుకోవాలని కోరుతున్నాం. నిర్దేశిత గడువు లోపు పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నిరందించాల్సి ఉండగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన సందర్భం ఎదురైంది.
సీఎంకు సూటి ప్రశ్న.. : ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాం. శ్రీబాగ్ వడంబడికను గౌరవిస్తూ, పాలనా వికేంద్రీకరణకు గత ప్రభుత్వంలో జగన్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. హైకోర్టు బెంచ్ ఏర్పాటు, సిడ్ హబ్, హార్టికల్చర్ హబ్ తో పాటు గత ప్రభుత్వంలో రాయలసీమలో ఏర్పాటుచేసిన కొన్ని రాష్ట్ర, కేంద్ర కార్యాలయాల తరలింపును తక్షణ ఆపి వేయాలని రాయలసీమ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఇతర బ్యాంకులతో విలీనమై, ఆర్థికంగా పరిపుష్టతతో ఉన్నటువంటి ఈ బ్యాంకును తరలించడం ఏమాత్రం సరికాదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా చేపడతామన్న చర్యల్ని నిబద్ధతతో పూర్తి చేయాలి. శ్రీశైలంలో నీటి నిలువ అంశంపై ఖచ్చితంగా దిశా నిర్దేశం చేయాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, తుంగభద్ర ఎగువ కాలువనిర్మాణం విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాయలసీమ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కాలయాపన చేస్తే ఇక ఊరుకోం
పాలక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ పోతే రాయలసీమ సమాజం ఇక ఊరుకోదన్న విషయాన్ని పాలకులు గుర్తించుకోవాలి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ఇవ్వని మెజార్టీని రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టిడిపికి ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుని కొనసాగాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయంగా రాయలసీమ బాసట, మద్దతు కావాలనుకుంటే ఇచ్చిన హామీలను అనెరవేర్చాల్సిన అవసరం, మాట నిలబెట్టు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా ప్రాంతాలతో పాటుగా రాయలసీమకు కూడా సమాన అవకాశాలు కల్పించి, హక్కులు, నిధులు, నీళ్లు ఇవ్వాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం.. పొరపాట్లను సరిదిద్దుకోవాలని, ఎవరైనా అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే దాన్ని సరిద్దుకునేందుకు రాయలసీమ ప్రజా సంఘాలతో మాట్లాడి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ముందున్నదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇంటర్వ్యూ: వనం శర్మ, ఎడిటర్ , పెన్నేరు.