
ప్రొద్దుటూరు (PENNERU News) :
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, తమ హక్కులను ప్రశ్నించడం ద్వారా సాధించుకోవచ్చని ప్రముఖ న్యాయవాది, రచయిత సివీ సురేష్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని అరబింద్ హైస్కూల్లో లోకా సమస్త హ్యూమెన్ రైట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవ హక్కుల పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది సివి సురేష్ మాట్లాడుతూ, చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి తమ కావాల్సిన వాటికోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో పెద్దయ్యాక సమాజం నుంచి చట్టబద్ధంగా పొందాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుత కాలంలో అనివార్యమైదన్నారు. 18వ శతాబ్దంలో మొదలైన ఫ్రెంచ్, రెవల్యూషన్లు ఆ తర్వాత అమెరికా, రష్యా రెవల్యూషన్, రైతాంగ పోరాటాలు ఇలా అనేక ఉద్యమాలు, పోరాటాలు హక్కుల సాధనకు జనాలకు ప్రశ్నించే విధానాన్ని అలవాటు చేశాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ హక్కులను సాధించుకునేందుకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పిడికిలి బిగించుకుని పోరాట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు మానవ హక్కుల పై అవగాహన చైతన్య కనిపించే కార్యక్రమాలను భవిష్యత్తులో పెద్ద ఎత్తున అనుభవించాలని అనుకుంటున్నట్లు సివి సురేష్ చెప్పారు.
అనంతరం న్యాయవాది, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సివి జయలక్ష్మి మాట్లాడుతూ, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకే తరహా విద్యా విధానం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు తమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 1098 కి కాల్ చేసి సేవలు పొందాలన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. . అలాగే లోక సమస్త హ్యూమన్ రైట్స్ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించారు.

