పోలవరం కడితే రాయలసీమ ఎలా సస్యశ్యామలం అవుతుంది?

బొజ్జా దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు.

  • శ్రీశైలంలో ఆదా అయ్యే నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా లు వాడుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి..
  • కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని సముద్రంలోకి పారపోస్తూ.. రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని వాడుకోవడం అన్యాయం చేయడమే.
  • రాయలసీమ సాగునీటి విషయంలో అధికారులు ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారు..

– పాలకులు ఇకనైనా మేల్కొని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది.

(Penneru News)

పోలవరం ఆంధ్రుల జీవ నాడిగా భావిస్తూ విభజన చట్టంలో దాన్ని సాధించుకుని నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అయితే పోలవరం నిర్మిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదనే చెప్పాలి. పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా, అందులో కరువు ప్రాంతమైన రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందన్న భావనని జనాలలో చొప్పించారు. పోలవరం ఒక భావోద్వేగా ప్రాజెక్టుగా మలచడంలో పాలకులు కృతకృత్యులయ్యారు.. ఈ సందర్భంలో పోలవరం వలన ఏ ప్రాంతానికి, ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఏ ప్రాంతానికి, ఎవరికీ నష్టం కలుగుతుంది? లేదా ప్రయోజనము అందదు అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవ సత్యాలు బహిర్గతమవుతాయి.

కృష్ణా డెల్టా కు నీటి కేటాయింపులు ఎలా జరిపారు

ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా మొదలవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల ద్వారా కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజ్ చేరుతాయి. కృష్ణా డెల్టా ప్రాంతానికి 181 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇందులో 80 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు హక్కుగా కేటాయించారు.‌ మిగిలిన 101.2 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మూసి, మున్నేరు, పాలేరు నదుల నుంచి కేటాయింపులు చేసారు. నాగార్జునసాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ మధ్యన క్యాచ్ మెంట్ ఏరియాలో ఈ 101.2 టీఎంసీ నీరు లభ్యమవుతుంది.

(శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ వరకు, అక్కడ నుంచి పులిచింతల రిజర్వాయర్, ఆ తరువాత ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా మొదలవుతుంది. కృష్ణా డెల్టా ప్రాంతానికి 181 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించారు. 80 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తారు. మిగిలిన 101 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మూసి, మున్నేరు, పాలేరు నదుల నుంచి రావాలి. నాగార్జునvసాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ మధ్యన క్యాచ్ మెంట్ ఏరియాలో ఈ 101 టీఎంసీ నీరు లభ్యమవుతుంది.)

గోదావరి నదిపై నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి అంటే – పోలవరం కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల నీటిని తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటిని ఇవ్వడం. ఎప్పుడైతే పోలవరం కుడి కాలవ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు ఇస్తారో అప్పటిదాకా శ్రీశైలం నుంచి తీసుకుంటున్న 80 టీఎంసీల నీటిని నిలుపుదల చేయడమే ఈ పోలవరం నిర్మాణ లక్ష్యాలలో ప్రధానమైంది.

శ్రీశైలంలో నిలబెట్టుకున్న 80 టీఎంసీల నీటిని రాయలసీమ అవసరాలకు వినియోగించుకోవచ్చు, ఇక ఏ ఇబ్బందులు రాయలసీమకు ఉండవు అన్న వాదనను పాలకులే కాక, కొన్ని ప్రజా సంఘాలు, కొందరు మేధావులు కూడా తెరమీదకి తీసుకొచ్చారు. పోలవరంతో రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుంది అన్న విశేష ప్రచారాన్ని కల్పించారు. ఇదే భావనను ఇక్కడ ప్రజల్లో కల్పించే గట్టిప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగానూ, నిర్మాణ లక్ష్యాలు అందుకు వ్యతిరేకంగానూ కనిపిస్తున్నాయి.

కృష్ణ డెల్టాకు నీళ్లు ఇచ్చే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్న కారణంగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు 2016లో మొదలు పెట్టి 2017లో..అంటే ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో పూర్తిచేసారు. పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తి పోసే కార్యక్రమాన్ని చంద్రబాబు ఆనాడు ప్రారంభించారు.

80 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి కృష్ణా డెల్టా అవసరాలు తీరుస్తున్నారు. మరి శ్రీశైలం నుంచి తీసుకుంటున్న 80 టీఎంసీల నీటిని అక్కడ ఆదా చేసుకుని రాయలసీమ అవసరాలకు వినియోగించే అవకాశం ప్రభుత్వాలు కల్పించాయా లేదా? వాస్తవం ఏమిటని చూస్తే విస్తుపోయే అంశాలే కనిపిస్తాయి.

ఆదా అయ్యే నీటిని ఎప్పుడో పంచేసారు

పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల లేదా పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో ఆదాఅయ్యే 80 టీఎంసీల నీటిని వాడుకునే విషయంలో గతంలోనే బచావత్ ట్రిబ్యునల్లో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఈ ఒప్పందం ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రాలకు 35 టీఎంసీల నీటిని ఇవ్వాలన్నది ఒక ఒప్పందం. ఇక మిగిలింది 45 టీఎంసీలు మాత్రమే. ఈ 45 టీఎంసీల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాలకు పైన భీమా ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు. భీమా ప్రాజెక్ట్ కు ఆనాడు 20 టీఎంసీల నీటిని కేటాయించారు. కృష్ణ నదిలో ఆదాఅయ్యే నీటి నుంచే ఈ 20 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపారు. ఆ విధంగానే నీటి వినియోగం కూడా సాగుతోంది. మొత్తంగా 35 టిఎంసీలు కర్ణాటక మహారాష్ట్రలకు పోను, భీమా ప్రాజెక్ట్ కు 20 టీఎంసీలు ఇవ్వగా ఇక మిగిలింది 25 టీఎంసీలు. ఈ 25 టిఎంసీల నీటినైనా రాయలసీమ వాడుకో గలుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నీటిలో కూడా తెలంగాణ తనకు వాటా ఇవ్వాలని కోరుతోంది. మరి పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీటిని ఇవ్వడం వల్ల శ్రీశైలంలో ఆదాఅయ్యే నీటిని రాయలసీమ వినియోగించుకునే వీలు ఎక్కడుందీ ?. పోలవరం ద్వారా ఆదాఅయ్యే నీటిని పంపిణీ చేయగా, చివరగా మిగిలిన 25 టీఎంసీల నీటిని రాయలసీమ వాడుకోగలుగుతుందా లేదా అన్న నేపథ్యంలో లోతుగా వెళ్లి చూస్తే నిజాలేమిటో తెలుస్తాయి.

KRMB లో రాయలసీమకు తీరని అన్యాయం

2015 జూన్ 18, 19 తేదీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీకి మధ్యన 101 టీఎంసీలకు బదులుగా 20 టీఎంసీల నీరు మాత్రమే తీసుకుంటున్నాం.. మిగిలిన నీటిని తాము నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకుంటాము అని కెఆర్ఎంబిలో నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి అవసరమైన నీటిని నిలువ చేసుకునేందుకు రిజర్వాయర్లు నిర్మించుకోకుండా వాడుకోవాల్సిన నీటిని సముద్రంలోకి పారబోసి రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కోరిక మేరకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో నిర్ణయం తీసుకోవడం ద్వారా రాయలసీమ నీటి హక్కులకు మరణ శాసనం రాశారు.

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆదాయే నీటిని రాయలసీమ అవసరాలు తీర్చడానికి వినియోగిస్తామని చెప్పిన పాలకులు.. తుంగభద్ర డ్యామ్ లో పూడిక చేరడం వల్ల , తుంగభద్ర ఎగువ కాలువ, దిగువ కాలువల ద్వారా వినియోగించుకోలేని నీరు శ్రీశైలంలోకి చేరుతోంది. అదేవిధంగా సాగునీటి కాలువలు సరిగా లేకపోవడం, రిజర్వాయర్లు లేకపోవడం వల్ల, కేసీ కెనాల్ నీరు, ఎస్ఆర్బిసి నీళ్ళు కూడా శ్రీశైలం లోకి చేరుతున్నాయి. ఈ నీటిని రాయలసీమకు వినియోగించు కోకుండా, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల వరకు కేటాయించిన నీటిని వృధాగా సముద్రం పాలు చేస్తూ, రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని తరలించుకు పోతున్న వైనాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా, పోలవరం నిర్మాణం అయితే రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు అందుతుంది అన్న అభూత కల్పనలు, భ్రమలు కల్పిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు అన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. జరుగుతున్న తప్పిదాలను ప్రభుత్వం గుర్తించి సరిదిద్ది రాయలసీమకు మేలు చేయాల్సిన అవసరం, ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ విషయంలో జరుగుతున్న తప్పులను సరిదిద్ది రాయలసీమ సాగునీటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సమాజం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు నష్టం

కృష్ణ డెల్టాకు కేటాయించి నీటిని సముద్రంలో పారబోస్తూ రాయలసీమకు కేటాయించిన నీటిని శ్రీశైలం నుంచి తీసుకోవడం వల్ల ఒక్క రాయలసీమకే కాదు నష్టం వాటిల్లేది.. నెల్లూరు, ప్రకాశం గుంటూరు జిల్లాలకు కూడా నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అన్యాయం జరగకుండా ఉండేలా పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం నుంచి కృష్ణ డెల్టాకు నీటిని తరలించే విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలి. కృష్ణా నదిలో హక్కుగా ఉన్న నీటిని రాయలసీమ వినియోగించుకోవడానికి వీలుగా అవసరమైన ప్రాజెక్టులను తక్షణం నిర్మించి తీరాలి. పోలవరం కడితే అంతా సస్యశ్యామల మవుతుందన్న ప్రచారాలను కూడా కట్టి పెట్టాలి. ఈ విషయాలపై పాలకులు మేధావులు ప్రజాసంఘాలు దృష్టి సారించాలి, రాయలసీమ సమాజం కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి!

Share to:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar