
ప్రొద్దుటూరు ( PENNERU న్యూస్) :
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక వైఎంఆర్ కాలనీలోని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గం దొరసాని పల్లె గ్రామంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత రెవిన్యూ సదస్సులో పాల్గొనడం ఆనందకరమన్నారు. అయితే ఈ సభలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారని, యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలపడంతో పాటు జగన్ గతంలో రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. రాయలసీమ ద్రోహి అని, బటన్ రెడ్డి అని, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను భూములు ఆక్రమించినట్లు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించానని చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు తేవడం, విద్యుత్ బిల్లుల పెంపు, నిత్యావసర ధరల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటు, ఫించన్ల తొలగింపు, గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్ ల ఏర్పాటు ఇదేనా సంపద సృష్టి అని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలు, సామాజిక ఫించన్ల పెంపు తప్పా మేనిఫెస్టోలోని ఏ ఒక్క పథకం అమలు జరగడం లేదన్నారు. ఉచిత ఇసుక సరైన విధాన రూపకల్పనే జరగడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయల నగదు పంపిణీ, 50 సంవత్సరాలకు ఫించన్, రైతులకు 20వేల పంటసాయం, చేనేత లకు ఉచిత విద్యుత్ ఇంకా అమలే చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశారో, ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్నారు. కొత్త ఉద్యోగాల మాట అటుంచి వున్న ఉద్యోగస్థులకే జీతాలు అందక ధర్నాలు చేసే దుస్థితి కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిందని వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానిని కేంద్రమే పూర్తి చేయాల్సి వుండగా, గతంలో ప్రధాని మోదీ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టు ను ఏటీఎంల వాడుకుంటున్నారని విమర్శించారు. కేవలం రాజధాని ప్రాంత పనులు మాత్రమే జరుగుతున్నాయని, అవి కూడా కేవలం కమ్మ కులస్తుల, టిడిపి నాయకుల ఆస్తి విలువ పెంపుకే జరుగుతున్నాయని వివరించారు. కాగా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వరద నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయన ఆరోపణలు నిరూపిస్తే తాను రానున్న ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేసారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చుక్కల భూముల సమస్యలు పరిష్కరించారని, రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వేలు చేయడంతో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న రెవిన్యూ సదస్సులను అసలు ప్రచారమే లేకుండా చేశారని తెలిపారు. జగన్ రాయలసీమ బిడ్డ నని గర్వంగా చెప్పుకుంటారని, చంద్రబాబు ఆ మాట ఎందుకు చెప్పుకోలేరని ప్రశ్నించారు. రాయలసీమకు హైకోర్టు ను దూరం చేయడం, కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేక పోవడం, కొప్పర్తిని తరలించడమే రాయలసీమ ద్రోహమని, అవి చేసింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ భీమునిపల్లె లక్ష్మిదేవి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గుర్రం లావణ్య, మన్నె సత్యం, సుబ్బారెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పాతకోట మునివంశీధర్ రెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి, నాగేంద్రారెడ్డి, నాయకులు ద్వార్శల భాస్కర్ రెడ్డి, పోసా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.