
అమరావతి (PENNERU News) :
ఏపీలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్న వేల టన్నుల బియ్యాన్ని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులకు అడ్డంకులు తప్పడం లేదు. పలు సందర్భాల్లో అధికారులే ఇందుకు సహకరిస్తున్న ఉదాహరణలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లా కలెక్టర్ కాకినాడ పోర్టు నుంచి సముద్రంలోకి వెళ్లి పట్టుకున్న దక్షిణాఫ్రికా నౌక స్టెల్లా ఎల్ 1లో దొరికిన రేషన్ బియ్యం వ్యవహారం సంచలనం రేపింది. స్టెల్లా ఎల్ 1 నౌకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా దొరికిన రేషన్ బియ్యం గతంలో తాము పట్టుకోగా.. దాని యజమాని కోర్టుకు వెళ్లి మరీ వాటిని విడిపించుకున్నారని కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలి షన్మోహన్ తెలిపారు. అయితే అవి తిరిగి ఓడలోకి ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గతంలో కోర్టు ఆదేశాలతో వదిలేసిన బియ్యం అయితే వాటి ఆధారంగా స్టెల్లా ఎల్ 1 ఓడపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవు. మరి అక్కడ దొరికిన బియ్యం అవేనా కాదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ ఇవాళ ప్రకటించారు. “సీజ్ ది షిప్, పవన్ పట్టు- చంద్రబాబు సంచలన నిర్ణయం..!!” కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ 1 షిప్పులో దొరికిన రేషన్ బియ్యం సంగతి తేల్చేందుకు ఇవాళ ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందులో పోర్టుతో పాటు రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, కస్టమ్స్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని, షిప్ సీజ్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని, గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కలెక్టర్ ప్రకటించారు. కాకినాడ పోర్టులో షిప్పులు తనిఖీ చేసే అధికారం తమకు ఉందని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం షిప్ పోర్ట్ ఆఫీసర్ కస్టడీ ఉన్నట్లు తెలిపారు.