
కడప ఫిబ్రవరి 16 (PENNERU NEWS)
దేశానికి విశేష సేవలు అందించిన ఛత్రపతి శివాజీ చూపిన బాటలో పయనిస్తూ ఆ మహానీయుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం సంతోష దాయకమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సంఘం నాయకులు వెంకటేశ్వర్ రెడ్డిలు తెలిపారు.
ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ –ఛత్రపతి శివాజీ ఐక్య వేదిక నాయకుల ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని నగరంలో శోభాయాత్రను ఘనంగా ఆదివారం నిర్వహించారు. నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్దగల అంబా భవాని దేవస్థానం వద్ద శోభాయాత్రను ప్రారంభించిన వారు మాట్లాడుతూ, తన 16వ యేటనే కత్తిపట్టి పోరాట వీరుడిగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న చక్రవర్తిగా శ్రీచత్రపతి శివాజీ గుర్తింపు పొందారన్నారు. హిందూ సామ్రాజ్య పతకాన్ని ఆవిష్కరించేందుకు ఆయన చేసిన పోరాటం ప్రశంస నీయమన్నారు. ముఖ్యంగా హిందూ జాతి సంరక్షించాలని, దేశంలో హిందూ సామాజ్రాన్ని పునరుద్దరింపబడాలని, దేశాన్ని హిందూ దేశంగా నిలబెట్టాలని ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.

అటువంటి మహానీయుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున శోభాయాత్రను ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ చక్రవర్తి చత్రపతి శివాజీ బాటలో పయనించాలని సూచించారు. అనంతరం శోభాయాత్ర నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కోలాటాలు, విన్యాసాలతో కొనసాగుతూ అంబా భవాని గుడివద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.