

ప్రొద్దుటూరు (Penneru News) : ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్ లో ఓ రూములో అక్రమంగా నిలువ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్ర వారం సీజ్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ పోలీసులు అందించిన సమాచారం మేరకు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఆటోనగర్ లో ఒక రూమ్ లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో గంగయ్య, డిటీ మల్లికార్జున, ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే ఇవి ఎవరికి సంబంధించిన బియ్యం అనేది ఇంకా తేలాల్సి ఉంది. బియ్యం శాంపిల్స్ ల్యాబ్ కు పంపుతున్నట్లు తహసీల్దార్ గంగయ్య చెప్పారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిన్న రాత్రి అక్రమంగా ఆటో నగర్ లో బియ్యం నిల్వ చేశారని రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్రమంగా నిల్వ ఉంచిన గది వద్ద రాత్రంతా పోలీసులు కాపలా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నిల్వ ఉంచిన అక్రమార్కులు విషయం తెలుసుకుని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యం అక్రమ రవాణా వెనుక వ్యక్తుల పై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది..