
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.
కడప (PENNERU News): పార్లమెంటులో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రం హోం శాఖ మంత్రిని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సీపీఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సంధర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం శాస్త్రీయ, హేతుబద్ధమైనదని, అలాంటి రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంటు సభ్యులైన అమిత్ షా రాజ్యాంగ విరుద్ధంగా మనువాదిగా అశాస్త్రీయమైన స్వర్గం, పుణ్యం అనే భాషలు వాడడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని గుర్తు చేశారు. దేశ సామాజిక సాంస్కృతిక ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా, భారత రాజ్యాంగంలో దేశీయ రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలు అన్నిటినీ కలిపి చేర్చారని, నిస్వార్థ ప్రజా సేవకుడు, దేశంలోనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలనాడుతూ మాట్లాడడం దేశ ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అంశం అన్నారు. బిజెపి నేతలు మనువాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారని, దీన్ని దేశ ప్రజలు అంగీకరించరని తీవ్రంగా హెచ్చరించారు.
దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ ఐక్యంగా పోరాటం చేసి దేశ భవిష్యత్తును అభివృద్ధి చేయడంలో కృషి చేస్తారని ఆయన అన్నారు. సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ.రామమోహన్ అధ్యక్షత వహించిన
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు ఐ.ఎన్. సుబ్బమ్మ, బి.మనోహర్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరిరెడ్డి, కె.శ్రీనివాసులరెడ్డి, వి.అన్వేష్, పి.చంద్రారెడ్డి, వేంకటేశ్వర్లు, ఎన్ .భైరవ ప్రసాద్, రామకృష్ణారెడ్డి, శివకుమార్, రవి, రాహుల్, నరసయ్య, సురేష్, చాంద్ బాష, సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.